10, మే 2007, గురువారం

శ్రుతిలయలు - తెలవారదేమో స్వామీ..

పల్లవి

తెలవారదేమో స్వామి
తెలవారదేమో స్వామి
నీ తలపుల మునుకలో
అలసిన దేవేరి అలమేలు మంగకూ

చరణం 1

చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవేరి అలమేలు మంగకూ

చరణం 2

మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునె మది మరి మరి తలచగ
మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామి గ మ ప ని
తెలవారదేమో
స ని ద ప మ ప మ గ ని స గ మ
తెలవారదేమో స్వామి
ప ని ద ప మ గ మ
ప స ని ద ప మ గ మ
ప స ని రి స గ రి మ గ రి స రి ని స
తెలవారదేమో స్వామి

చిత్రం: శ్రుతిలయలు
సంగీతం: కె వి మహదేవన్
సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం: కె జె ఏసుదాసు

సాహిత్య సౌజన్యం: www.telugubiz.net

ఈ పాట మొదట అన్నమాచార్య కీర్తన అనుకున్న. సిరివెన్నెల గారు రాశారు అని తరవాత తెలిసింది. చాలా అందంగా రాశారు. రెండవ చరణం లో మొదటి రెండు వాక్యాలు నాకు అస్సలు అర్థం కాలేదు. ఎవరికైనా అర్థం ఐతే చెప్పండి.

28 కామెంట్‌లు:

  1. ఇలా చదువుకోవాలి -
    ఓ స్వామీ, నీ దేవేరి అలమేలు మంగకు తెలవారలేదా (అంటే నిద్ర లేవలేదా)?
    ఎందుకు నిద్ర లేవలేదూ? అలసింది కాబట్టి - అలసిన దేవేరి
    ఎందుకు అలసిపోయింది? నువ్వు మక్కువ (ఇష్టం) మీరగ (ఎక్కువకాగా) అక్కున (కౌగిట) చేర్చి అంగజు కేళిని (మన్మథ కృఇడ, సంభోగంలో) పొంగుచు తేల్చగ (వివశురాలయే విధంగా అలరించావు).
    సంభోగము ముగిసినా ఆవిడ మిగతా రాత్రి అంతా ఆ వివశత్వాన్ని మరిచి పోలేక మరీ మరీ తలుచుకుంటూ మెలకువగానే ఉండిపోయింది - దాంతో అలసిపోయింది. అంచేత పొద్దున ఆమెకింకా తెల్లవారినట్లు లేదు.

    ఇది పదకవితాపితామహుని అద్భుత దివ్య శృంగార కీర్తన - "పలుకుతేనెల తల్లి పవళించెను" కి ఒక నీరసమైన అనుకరణ.

    రిప్లయితొలగించండి
  2. ఇలా చెప్పేవాళ్లుంటే అన్నమయ్య కీర్తనలు కూడా అందరికీ అర్థమై, ఆయన పదకవితా పితామహుడు ఎందుకయ్యాడో తెలుస్తుంది. ఇంతకూ గురువుగారూ, "నీరసమైన అనుకరణ" ఎందుకయ్యిందిది?

    రిప్లయితొలగించండి
  3. సిరివెన్నెల గారు అనుకరణ ఐనా బానే రాశారు కాదా.. మరి "నీరసమైన అనుకరణ" అని ఎందుకు అన్నారు ?

    రిప్లయితొలగించండి
  4. @రానారె - నేను వివరించింది ఒక సినీగీతాన్ని, అన్నమయ్య పదాన్ని కాదు. అంత శక్తి నాకు లేదు.

    @ రానారె మరియు ప్రదీప్ - నీరసమైన అనుకరణ అని ఎందుకన్నాను? ఒరిజనల్ చదివితే తెలుస్తుంది. ఇదుగో ఒరిజినల్. చదివినా అసలుకీ నకలుకీ ఉన్న అంతరం అర్థం కాకపోతే నేను చెప్పలేను.


    http://annamacharya-lyrics.blogspot.com/2006/11/blog-post.html

    రిప్లయితొలగించండి
  5. కొత్త పాళీ గారు.. అన్నమాచార్యుల వారి ఇంత మంచి పాట పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు. ఆ పాట విన్నాక, "తెలవారదేమో.." ని మీరు నీరసమైన అనుకరణ అని ఎందుకు అన్నారో అర్థమవుతుంది. :)
    ఏమైనా, సిరివెన్నెల గారిని తక్కువ అంచనా వెయ్యకండి. ఆయనలా ఈ మధ్యన ఎవరు రాస్తున్నారు చెప్పండి..
    ఇంకో విషయం.. కొత్త పాళీ గారు పంపిన లంకె లోని అన్నమాచార్యుల కీర్తన "మా తెలుగు తల్లి.." పాట లా ఉందే.. రెండూ ఒకే రాగమేనా ?

    రిప్లయితొలగించండి
  6. Can somebody explain first charanam also.
    I didn'get chaluvami nevalaga..

    Thanks

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెలువము అంటే అందం, చెంగట అంటే దగ్గరగా అందాన్ని ఏలడానికి దగ్గరగా లేవని కలత చెందిన నెలత (స్త్రీ/భార్య)కు నిద్దుర కరువై, ఆ కలల(ఊహల/ఆలోచనల)తో అలసిన దేవేరి అలివేలు మంగమ్మకు తెల్లవారదేమో స్వామి.

      తొలగించండి
  7. "పేరు చెప్పి శరణు కోరి బుద్ధిగా అడుగు - అప్పుడు చెబుతా!"
    :-))

    ఇది మాయా బజారులో జోకే అయినా, నేను సీరియస్ గానే అంటున్నా. ఒక బహిరంగ వేదికలో మీరు తెలుసుకో గోరిన విషయం అడుగుతున్నప్పుడు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవటం సాంప్రదాయం. ఇలా మొహం చాటు చేసి ప్రశ్నలడగటం పద్ధతి కాదు.

    రిప్లయితొలగించండి
  8. గురువుగారూ థాంకులు. విషయాన్ని మరీ అన్నమాచార్య రాసినంత చిక్కగా రాస్తే సినిమాలో ఆ సన్నివేశానికి అంతగా అతకదనో, రసం ఎక్కువైతే ఈ కాలంలో విమర్శలొస్తాయనో కాస్త నీరసంగా రాసివుండొచ్చు.

    రిప్లయితొలగించండి
  9. భళీ, కావాలని కూడా నీరసంగా రాస్తారా! అయివుండ వొచ్చు :-)

    శీను

    రిప్లయితొలగించండి
  10. ranare - You could be right. There might me some limitations or restrictions while sirivennela penned this. I am sorry, if you see any sarcasm in my earlier comment. It was absolutely not intentional. I was trying to write in telugu using lekhini (first time) and copying/pasting/correcting on this comments page and before composing complete comment I hit the wrong button :-(

    Seenu

    రిప్లయితొలగించండి
  11. నీ వాదనలో పసలేదు రామనాథా! ఈ బ్లాగు రాసిన ప్రదీపు, పైన వ్యాఖ్య రాసిన యెనానిమస్సుడు ఇంకా వివరణ కోరడమే తార్కాణం. చిక్కదనం జీర్ణం కాదని పలుచన చేసి ఇక ప్రయోజనమేముంది?
    అసలు సమస్య అది కాదులే - కవితాత్మ లోపించడంలో ఉంది. తేలికైన మాటలతో కూడా చిక్కని కవిత్వం రాయొచ్చు - ఉదాహరణకి కృష్ణశాస్త్రి పాటలు చూడు (సడి సేయకో గాలి)

    అయ్యా శీను మహాశయా, పైని యెనానిమస్సులు తమరేనా?

    రిప్లయితొలగించండి
  12. @ ప్రదీప్ - భళీ! అవును రెండూ ఒకటే రాగం. దాని పేరు ఆభేరి. నగుమోము గనలేని అనే త్యాగరాజ కృతి సుప్రసిద్ధం. జానకి పాడిన నీలీల పాడెద దేవా కూడా ఈ రాగమే. అన్నట్టు మనమిక్కడ మాట్టాడుకుంటున్న నీరసప్పాట కూడా అదే రాగంలో స్వరపరిచారు-ట.

    రిప్లయితొలగించండి
  13. కొత్తపాళీ గారు,

    కాదు.

    శీను

    రిప్లయితొలగించండి
  14. Hai Pradeep (and anyone else interested),
    You can see "paluku taenela talli" with explanation here:
    http://telpoettrans.blogspot.com/2007/07/blog-post.html

    రిప్లయితొలగించండి
  15. అది "అశ్రువులు" అని వాడేటప్పుడు కదా వాడాలి ??
    "శృతి" పదం సరైనదే అనుకుంటా..

    రిప్లయితొలగించండి
  16. :) ఏమో.. నాకైతే, "శృతి"నే సరి అనిపిస్తుంది.
    Any citations ?

    రిప్లయితొలగించండి
  17. श्रुति स्मृति पुराणानामालयं करुणालयं|
    नमामि भगवत्पादशंकरं लॊकशंकरं ||

    ఇది శంకరభగవత్పాదులవారికి స్మార్త సాంప్రదాయంలో అంజలి. ఈ శ్లోకంలో మొదటి మాట శ్రుతి, రెండోది స్మృతి, పరికించగలరు. ఇక్కడ శ్రుతి అంటే వేదం. వేదాలు అపౌరుషేయాలూ,అనుశ్రుతంగా వచ్చినవి కాబట్టి, ఆ పేరు.ఇంకా శ్రవణమూ, శ్రావ్యమూ లాంటి వినడానికి సంబంధించిన మాటలన్నీ ఈ గూటివే!

    "శృ" తో వచ్చే శృంగము (అంటే కొమ్ము) లాంటి మాటల వ్యుత్పత్తి వేరు.

    నాది పరిమిత జ్ఞానమని తెలిసి కూడా, "శృతి" అన్న మాట అసంబద్ధమని చెప్ప దుస్సాహసం చేస్తున్నాను. తప్పైతే విజ్ఞులు మన్నించగలరు. సెలవు.

    రిప్లయితొలగించండి
  18. మీరు మరీ ఇంతగా వివరణ ఇచ్చాక కూడా నమ్మకుండా ఉంటామా చెప్పండి... :)
    వివరణ చాలా బాగా ఇచ్చారు. "శృ"ని "శ్రు"గా మార్చాను.

    రిప్లయితొలగించండి
  19. చాలా బావుంది చిన్నమయ్యగారూ .. మీరలా దేవనాగరిలో రాయడం కూడ మంచిదయ్యింది, ఈ తేడా తెలీడానికి. దీని స్పెల్లింగు పై ఎప్పుడూ శ్రద్ధ పెట్టలేదు గానీ నేనూ చాలా సార్లు శృతి అనే రాశాను అనుకుంటున్నా ఇన్నాళ్ళూ.

    రిప్లయితొలగించండి
  20. కొత్తపాళీ గారు,
    మీరన్న అన్నమయ్య పాట ఈ పాటకి స్ఫూర్తి అయితే అయుండొచ్చుగాని, అనుకరణ కాదని నా అభిప్రాయం. అన్నమయ్య పాటలో ఒక్క సంభోగశృగంగారం మాత్రమే ఉంటే, ఇందులో విప్రలంభ శృగంగారం కూడా ఉంది. రెండురకాలుగానూ అలమేలుమంగకి నిద్ర కరవే అనడంలో ఉంది దీని ఒరిజినాలిటీ.

    అన్నట్టు, "శృతి" సరికాదు, "శ్రుతి" సరైనదని మీరు లింకిన అన్నమాచార్య బ్లాగులోని పద్యం యతులని చూస్తే బోధపడుతుంది. దాని గురించి వివరంగా వీలుచూసుకొని బ్లాగుతాను:-)

    రిప్లయితొలగించండి
  21. నాకింకా అర్థం కాలేదు శృతికీ, శ్రుతికీ తేడా.
    అర్థాలు వేరని తెలుస్తూ ఉంది. పలకడంలో ఏమన్నా తేడా ఉందా?
    "శృతి"నే రెండు అర్థాలలో వాడితే తప్పా? ఎలా? వివరించగలరా?
    ఇప్పుడూ ఒక అమ్మాయి పేరు శ్రుతి అని పెట్టుకున్నారు.
    అది వారే అర్థంలో పెట్టుకున్నారో దాన్ని బట్టి పేరు రాయాలంటారా??

    రిప్లయితొలగించండి
  22. లలితగారు,
    రెండు పదాలు లెవండీ, ఉన్నది ఒకటే పదం అది "శ్రుతి". "శృతి" అని చాలామంది అనుకొంటారు కానీ అది తప్పు. సంగీతంలోని "శ్రుతి", వేదము, చెవి, ఇలా ఈ పదానికి చాలా అర్థాలున్నాయి.

    రిప్లయితొలగించండి
  23. Sangeetham Samudram Adi pandithulake kani nalanti pamarulaku artham kadani maroasari naku thelisivachindi

    రిప్లయితొలగించండి